బిల్‌గేట్స్ అల్లుడు ఇతడే

వాషింగ్టన్ డిసి :  ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మెలిండా దంపతుల కుమార్తె జెన్నిఫర్ గేట్స్ నిశ్చితార్థం పూర్తి అయింది. ఈజిప్టుకు చెందిన గుర్రపు స్వారీ ఆటగాడు నయెల్ నాసర్(29) జెన్నిఫర్(23)తో తన నిశ్చితార్థం అయిందని జెన్నిఫర్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌ ద్వారా తెలిపింది. ఈ మేరకు మంచుకొండల్లో నయెల్‌ నాసర్‌తో దిగిన ఫోటన్‌ను షేర్‌ చేస్తూ తన సంతోషాన్ని పంచుకుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ జీవితంలో ప్రేమను పంచుకుంటూ తాము ముందుకు వెళ్తామని ఆమె పేర్కొన్నారు. కాగా, గత కొన్నేళ్లుగా నాసర్‌, జెన్నిఫర్‌లు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.


జెన్నిఫర్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆమె పోస్ట్‌కు ఇప్పటికే 46వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. పలువురు నెటిజన్లు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఇక జెన్నిఫర్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌ పోస్ట్‌పై ఆమె తల్లిదండ్రులు హర్షం వెలిబుచ్చారు. ‘ నేను ఆశ్చర్యానికి గురయ్యాను. అభినందనలు’ అని బిల్‌గేట్స్‌ కామెంట్‌ చేయగా, ‘నిన్ను, నయెల్ నాసర్‌ను జంటగా చూడడం సంతోషంగా ఉంది’ అని మెలిండా గేట్స్‌ ట్వీట్‌ చేశారు. ఇక నయెల్‌ నాసర్‌ కూడా తన నిశ్చితార్థానికి సంబందిన విషయాన్ని ఇన్‌స్ట్రాగ్రామ్‌ ద్వారా తెలిపారు. ‘ చాలా సంతోషంగా ఉంది. ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉండరేమో’ అంటూ జెన్నిఫర్‌తో దిగిన ఫోటోను షేర్‌ చేశారు.