ఆక్లాండ్: గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా- కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌ల మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసిందే. తొలుత రవీంద్ర జడేజా లాంటి బీట్స్ అండ్ పీసెస్ ఆటగాళ్లకు తాను ఫ్యాన్ కాదని, జడేజా టెస్టు క్రికెటర్ మాత్రమేనని, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు అతడు అన్‌ఫిట్ అంటూ మంజ్రేకర్ వ్యాఖ్యానించగా, అందుకు జడేజా సైతం గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. తన స్థాయి ఏమిటో తెలుసని, నీకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన చరిత్ర తనదని కౌంటర్ ఇచ్చాడు. అయితే ఆనాటి మంజ్రేకర్ మాటల్ని జడేజా ఇంకా మర్చిపోలేదు. (ఇక్కడ చదవండి: బుమ్రాపై గప్టిల్ ప్రశంసలు)
న్యూజిలాండ్‌తో రెండో టీ20లో టీమిండియా విజయం సాధించిన తర్వాత మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కేఎల్ రాహుల్‌కు దక్కింది. దీనిపై ట్వీట్ చేసిన మంజ్రేకర్.. రెండో టీ20లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు బౌలర్‌కు ఇస్తే బాగుండేది అని పేర్కొన్నాడు. దానికి జడేజా రీట్వీట్ చేస్తూ ఆ బౌలర్ పేరు కూడా చెబితే బాగుంటుంది కదా అని సెటైర్ వేశాడు. నిన్నటి మ్యాచ్‌లో జడేజా 4 ఓవర్లు వేసి 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లు సాధించాడు. కేన్ విలియమ్సన్, గ్రాండ్ హోమ్‌లను జడేజా ఔట్ చేశాడు. ఒక బౌలర్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకుని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇచ్చి ఉంటే అది కచ్చితంగా జడేజాకే దక్కేది. దీన్ని ఉద్దేశిస్తూనే ఆ బౌలర్ పేరు కూడా చెప్పు అంటూ మంజ్రేకర్‌ను జడేజా టీజ్ చేశాడు. దానికి మంజ్రేక్ రిప్లే ఇస్తూ.. ‘హా..హా.. నువ్వు కానీ, బుమ్రా కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు అర్హులు. బుమ్రాకు ఎందుకంటే అతని వేసిన నాలుగు ఓవర్ల ఎకానమీ చాలా బాగుంది’ అని బదులిచ్చాడు. (ఇక్కడ చదవండి: రెండో టి20లో భారత్ ఘన విజయం)