ఉరి తీస్తున్నాం.. కడసారి చూసివెళ్లండి

న్యూఢిల్లీ : నిర్భయ దోషులను ఉరితీసేందుకు తీహార్‌ జైలు అధికారులు సిద్ధమవుతున్నారు. ఢిల్లీలోని పటియాల కోర్టు ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలలోపు నలుగురు దోషులు వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ కుమార్‌(31), ముఖేష్‌ కుమార్‌ (32), పవన్‌(26)లకు మరణశిక్ష విధించనున్నారు. ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులను చివరిసారిగా చూసుకునే అవకాశం దోషులకు కల్పించాలనేది అనవాయితీ. అయితే మీ చివరి కోరిక ఏంటని జైలు అధికారులు దోషులను ప్రశ్నించినప్పడు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఉరిశిక్ష అమలుకు సమయం దగ్గర పడుతుండటంతో దోషుల తల్లిదండ్రులుకు జైలు అధికారులు ఓ వర్తమానం పంపారు. ‘నిర్భయ అత్యాచార, హత్య కేసులో దోషులుగా తేలిన నలుగురిని ఫిబ్రవరి 1న ఉరితీస్తున్నాం. ఈలోపు మీ పిల్లల్ని చివరి సారిగా చూసుకోవడానికి ఉరితీసే సమయంలో లోపు జైలుకు రావచ్చు’ అని సమాచారం ఇచ్చారు. (చివరి కోరిక చెప్పని నిర్భయ దోషులు)










కాగా ఉరిశిక్ష అమలుకు అధికారులు జైలు నెం3లో ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఇసుక బస్తాలతో ట్రైల్స్‌ కూడా నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పవన్‌ జల్లద్‌ నలుగురు దోషులను ఉరితీయనున్నారు. కాగా అనేక ఉత్కంఠ పరిణామాలు, రివ్యూ పిటిషన్ల కొట్టివేత అనంతరం వారి ఉరికి రంగం సిద్ధమైంది. ఉరిశిక్షను తప్పించుకునేందుకు దోషులు చేయని ప్రయత్నలు లేవు. చివరికి సుప్రీంకోర్టు కూడా వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.